: ఆకాశ్ చోప్రా- శ్రీశాంత్ మధ్య ఆసక్తికరమైన మాటల యుద్ధం!
టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రస్తుతం శ్రీశాంత్ బీజేపీ నేతగా ఉండగా, ఆకాశ్ చోప్రా క్రికెట్ వ్యాఖ్యాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశ్ చోప్రా ఫేస్ బుక్ లో అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తుండగా, 'శ్రీశాంత్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు కదా? మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందా?' అంటూ ఒకరు ప్రశ్నించారు. దీనికి 'రాడు' అంటూ ఆకాశ్ చోప్రా స్పష్టంగా చెప్పాడు. దీనికి ఆ అభిమాని, 'అది తప్పు మిత్రమా... ఏం జరుగుతుందో ఎలా చెప్పగలవు' అని హితవు పలికాడు. దీనికి సమాధానమిచ్చిన ఆకాశ్ చోప్రా... 'మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వ్యక్తి జట్టులో స్ధానం సంపాదిస్తాడని భావించడం సంగతి తెలియదని, అది తన అభిప్రాయమ'ని స్పష్టం చేశాడు.
దీంతో మధ్యలో కల్పించుకున్న శ్రీశాంత్... 'ఆకాశ్ చోప్రాది రెండు నాల్కల ధోరణి అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నీకు ఫోన్ చేయాలంటే కూడా సిగ్గేస్తోంది. నువ్వు చెప్పిన సమాధానం చాలా బాధ కలిగించింది' అన్నాడు. దీనికి ఆకాశ్ చోప్రా సమాధానమిస్తూ... 'అది రెండు నాల్కల ధోరణి కాదు, నా అభిప్రాయం. దానిపైనే నేను ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాను. దీనిపై నేను ఎవరికీ సమాధానమివ్వాల్సిన అవసరం లేదు, సొంత తమ్ముడి గురించైనా ఇలాంటి అభిప్రాయమే వెల్లడిస్తా'నని స్పష్టం చేశాడు. దీనిపై మండిపడ్డ శ్రీశాంత్, 'నేను క్రికెట్ ను ప్రాణాలు ఫణంగా పెట్టి ఆడుతాను. ఏదో ఒకరోజు మళ్లీ భారత జట్టుకు ఆడుతాను. అవకాశాలు ఎంత తక్కువ ఉన్నా ఒకరోజు నేను టీమిండియాకు ఆడుతా'నని స్పష్టం చేశాడు. ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.