: చంద్రబాబును రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారుతానంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టీఆర్ఎస్ ను వీడి, మళ్లీ టీడీపీలో చేరుతున్నానంటూ బోగస్ ప్రచారాలు చేస్తున్నారని... అవన్నీ అవాస్తవాలని కొట్టి పడేశారు. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను కలసి తాను మాట్లాడిన విషయం వాస్తవమేనని... అయితే తమ భేటీ వెనుక రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం రాజకీయాలకు అతీతమైనదని చెప్పారు.
రేవంత్ రెడ్డిది మొదటినుంచి సంకుచిత మనస్తత్వమని ఎర్రబెల్లి విమర్శించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరు చేస్తారో మొదటి నుంచి అందరికీ తెలుసని అన్నారు. రాత్రి పూట ఎవరెవరు ఎవరెవరి ఇంటికి వెళతారో అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. బీజేపీ మొదలుకొని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని అన్నారు.