: ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌ను ఎలా చంపారో తెలుసా?: తాజాగా వెలుగు చూసిన ఆ మిస్టరీ!
తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ మృతిపై 13 ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరప్పన్‌ను మట్టుబెట్టినప్పటి అనుభవాలతో మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ రాస్తున్న పుస్తకంలోని కొన్ని అంశాలు బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలో ఈ పుస్తకం బయటకు రానున్న నేపథ్యంలో తాజా సమాచారం పుస్తకంపై భారీ అంచనాలు పెంచుతోంది. వీరప్పన్‌ను తుదముట్టించడంలో చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒకరు ప్రముఖ పాత్ర పోషించినట్టు బహిర్గితమైన సమాచారం ద్వారా తెలుస్తోంది.
వీరప్పన్‌తో సన్నిహిత సంబంధం ఉన్న పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘా పెట్టారు. వీరప్పన్‌కు చెందిన గూఢచారి ఒకరు పారిశ్రామిక వేత్తను కలుసుకునేందుకు హోటల్‌కు వచ్చాడు. మంతనాల తర్వాత అతను వెళ్లిపోయాడు. ఆ వెంటనే పారిశ్రామిక వేత్తను కమెండో దళాలు చుట్టుముట్టాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆయన అసలు విషయం చెప్పేశాడు. తనకు చూపు మందగించడంతో కంటి ఆపరేషన్‌కు ఏర్పాటు చేయడంతోపాటు మారణాయుధాలు కూడా కావాలని వీరప్పన్ వర్తమానం పంపినట్టు తెలిపాడు. ఈ సమాచారంతో వీరప్పన్‌ను పట్టుకునేందుకు పోలీసులు పావులు కదిపారు. పేరుమోసిన రౌడీ అయోధ్యకుప్పం వీరమణిని ఎన్‌కౌంటర్ చేసిన ఎస్సై వెల్లదురైని మారువేషంలో వీరప్పన్ వద్దకు పంపాలని విజయకుమార్ నిర్ణయించారు. అనంతరం పారిశ్రామిక వేత్తను కలిసి ప్లాన్ వివరించారు.
పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. తాను ఓ మనిషిని పంపుతానని, అతడితో కలిసి వస్తే తిరుచ్చి, లేదంటే మదురైలో కంటి ఆపరేషన్ చేయిస్తానని గూఢచారికి చెప్పి పంపించాడు. దీంతో వీరప్పన్ గూఢచారి ఓ లాటరీ టికెట్ కొని దాన్ని సగానికి చించి ఓ ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్క తెచ్చే వ్యక్తితో వీరప్పన్ వస్తాడని అతడికి చెప్పి వెళ్లిపోయాడు. పారిశ్రామికవేత్త నుంచి రెండోముక్కను తీసుకున్న విజయకుమార్ దానిని ఎస్సై వెల్లదురైకి ఇచ్చి పంపి, అడవుల్లోకి వెళ్లి వీరప్పన్‌ను కలుసుకున్నారు. దీంతో ఆయన వెంటనే వీరప్పన్ కంటి ఆపరేషన్‌కు బయలుదేరాడు. పోలీసులు ముందుగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లోకి వీరప్పన్, అతని అనుచరులను ఎస్సై ఎక్కించారు. ధర్మపురి వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న కమెండోలు అంబులెన్స్‌పై కాల్పులు జరిపి వీరప్పన్‌ను హతమార్చారు. వీరప్పన్ కథకు పోలీసులు ఇలా ముగింపు పలికారు. పోలీసులకు సహకరించిన పారిశ్రామిక వేత్తను వదిలేశారు కానీ ఆయన పేరును మాత్రం పోలీసులు ఇప్పటికీ బయటపెట్టలేదు.