: ‘జవాన్’ లో నా పాత్ర సోల్జర్ కాదు: నటుడు సాయిధరమ్ తేజ్
‘మెగా’ కుటుంబం హీరో సాయిధరమ్ తేజ్ నటించనున్న తాజా చిత్రం ‘జవాన్’. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సైనికుడి పాత్రలో కనిపిస్తాడంటూ హల్ చల్ చేస్తున్న వార్తలను ఆ యువహీరో ఖండించాడు. ఈ చిత్రంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా, దేశ భక్తుడి పాత్రను పోషిస్తున్నానని చెప్పాడు. దేశం-కుటుంబం..ఈ రెండింటిలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనే పరిస్థితి తలెత్తే ఓ సన్నివేశం ఈ చిత్రంలో ఉంటుందని, దేశానికే మొదటి ప్రాముఖ్యతను ఇస్తాడని సాయి ధరమ్ చెప్పాడు.
ఈ చిత్రంలో పాత్ర కోసం చాలా బరువు తగ్గానని, చాలా ఫిట్ నెస్ తో కనపడతానని అన్నాడు. ఇందుకోసం, తాను చాలా శ్రమించానని, ఈ చిత్రంలో తన హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ పిర్జాదా నటిస్తోంది.