: యూపీలో కొత్త సంప్రదాయం...ముఖ్యమంత్రి అభ్యర్థులెవరూ బరిలో లేరు!


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలో లేకపోవడం విశేషం. ఎస్పీ-కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన అఖిలేశ్‌ యాదవ్ ఈ ఎన్నికల్లో ఎక్కడ నుంచీ కూడా పోటీ చేయడం లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఎన్నికల బరిలో లేరు. అలాగే రాష్ట్రీయ లోక్‌ దళ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి జయంత్‌ చౌధరి కూడా వారి బాటలోనే నడుస్తూ పోటీలో దిగలేదు. ఇక బీజేపీ తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా ప్రజలను సస్పెన్సులో వదిలేసింది. వీరంతా బరిలో నిలిస్తే వారి వారి నియోజక వర్గాల ప్రచారానికే సమయం సరిపోతుందని, అలా కాకుండా ప్రధాన ప్రచారకర్తలుగానే వుంటే కనుక పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందని వారు నిర్ణయించుకుని పోటీకి దూరంగా ఉన్నారు.

 ఈ సంప్రదాయానికి  2007లో బీఎస్పీ అధినేత్రి మాయావతి నాంది పలికారు. ఆ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించి ఆమె అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆమె మండలి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తాను మండలి అభ్యర్థిగా ఉండేందుకే ఇష్టపడతానని ప్రకటించారు. తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. అయితే ప్రస్తుతానికి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

 ఇక 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనౌజ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన అఖిలేశ్‌ యాదవ్ కూడా 2012లో ఉత్తరప్రదేశ్ కి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఘన విజయం సాధించడంతో, ఆయన తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. గతంలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేవారు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా కొనసాగేందుకే ఇష్టపడుతున్నారు.

  • Loading...

More Telugu News