rahul gandhi: ముష్కరమూకలు కేజ్రీవాల్ సాయంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి: రాహుల్ గాంధీ
పంజాబ్‌లోని మౌర్‌మండిలో జరుగుతున్న కాంగ్రెస్ సభలో రెండు రోజుల క్రితం ఓ కారులో పేలుడు సంభవించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ పేలుడులో కేజ్రీవాల్ హస్తం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని భావించే ముష్కరమూకలు కేజ్రీవాల్ సాయంతో బీభత్సం సృష్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పంజాబ్ తిరిగి తీవ్రవాదం గుప్పిట్లోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.
మనం నివసించే ప్రాంతంలో శాంతియుత వాతావరణమే ముఖ్యమని పేర్కొన్న రాహుల్ గాంధీ... ఆ వాతావరణానికి భంగం కలిగితే హింస, ఉద్రిక్తతలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలతో తీవ్రవాదులు మళ్లీ తలెత్తుకు తిరగడం ప్రారంభిస్తారని ఆయన అన్నారు. అటువంటి వాతావరణంలో నివసించే ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆ రాష్ట్రంలో అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు.