: ధోనీ రికార్డు సమం చేసిన కోహ్లీ
కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి ఓటమెరుగని కెప్టెన్ గా ఉన్న ధోనీ రికార్డును కోహ్లీ సమం చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిననాటి నుంచి టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో ఇప్పటి వరకు ఓటమెరుగని జట్టుగా రికార్డులకెక్కింది. వరుసగా ఏడు సిరీస్ లు గెలిచిన కోహ్లీ, 2013 జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ధోనీ ఆడిన ఏడు సిరీస్ విజయాల రికార్డును సమం చేశాడు. 2015 ఆగస్టులో టెస్టు కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ తాజాగా వన్డే, టీ20 పగ్గాలు తీసుకుని పూర్తిస్థాయి కెప్టెన్ గా మారాడు. ఈ క్రమంలో పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ తో ఆడిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లను గెలుచుకుని ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్ ల వివరాల్లోకి వెళ్తే...
1) శ్రీలంకతో టెస్ట్ సిరీస్ 2-1 తేడాతో విజయం.
2) దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో ఘన విజయం.
3) వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ 2-0 క్లీన్ స్వీప్.
4) న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ 3-0 క్లీన్ స్వీప్.
5) ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ 4-0 తేడాతో క్లీన్ స్వీప్.
6) ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ 2-1 తేడాతో విజయం.
7) ఇంగ్లండ్ తో టీ-20 సిరీస్ 2-1 తేడాతో విజయం సాధించడంతో కోహ్లీ, ధోనీ సరసన చేరాడు.