: మోదీని డొనాల్డ్ ట్రంప్ తో పోల్చిన లాలూ ప్రసాద్ యాదవ్!


పార్ల‌మెంటులో రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ ప్ర‌సంగం జ‌రుగుతున్న స‌మ‌యంలో అక్క‌డే కుప్ప‌కూలిపోయిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అహ్మద్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న మృతికి సంతాప సూచకంగా పార్లమెంట్ సమావేశాలను రేపటికి వాయిదా వేయకుండా, బడ్జెట్ ను ప్రవేశపెట్టడాన్ని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తీవ్రంగా త‌ప్పుబ‌డుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పోల్చుతూ... డొనాల్డ్‌ ట్రంప్ అమెరికాలో నియంతృత్వ విధానాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడాన్ని గుర్తు చేశారు. ఇక్క‌డ కూడా మోదీ అలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఎంత మొత్తంలో నల్లధనాన్ని వెలికితీశారని ఆయ‌న ప్ర‌శ్నించారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ నిర్ణ‌యం ఎలా ప్రభావం చూపింది? వంటి విషయాలను బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదని లాలూ నిల‌దీశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఆ నిర్ణ‌యం వ‌ల్ల‌ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడిందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలు మరణిస్తే సభను ఒకరోజు వాయిదా వేస్తారని ఆయ‌న అన్నారు. అయితే, మోదీ స‌ర్కారు మాత్రం ఈ సంప్రదాయాన్ని కాలరాసిందని చెప్పారు. మోదీ స‌ర్కారు అమానుషంగా వ్యవహరించిందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News