: నిజాయతీగా ట్యాక్స్ కడుతున్న వారికి ఈ బడ్జెట్తో కొన్ని ప్రయోజనాలు: ఢిల్లీలో అరుణ్ జైట్లీ
నిజాయతీగా ట్యాక్స్ కడుతున్న వారికి ఈ రోజు తాను పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తాము నల్లధనంపై పోరాటానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. అభివృద్ధికి ఆస్కారం ఉన్న వాటిపై దృష్టి పెట్టి వాటికి అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు.
మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిచ్చినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. చెక్కుల రూపంలో విరాళాలు ఇస్తే నల్లధనం అనేది ఉండబోదని, అందుకే తాము రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.