: ఆన్ లైన్లో బుక్ చేస్తే సర్వీస్ టాక్స్ రద్దు... సాధారణ బడ్జెట్ లో విలీనమైన రైల్వే బడ్జెట్ హైలైట్స్
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ బడ్జెట్ తో కలిపి రైల్వే బడ్జెట్ ను తీసుకువచ్చిన అరుణ్ జైట్లీ, కొత్త రైళ్ల ప్రస్తావన లేకుండానే ఆ అంశాన్ని ముగించారు. రైల్వేలకు రూ.1.31 లక్షల కోట్ల నిధిని కేటాయిస్తూ, ప్రభుత్వం తరఫున మరో రూ. 55 వేల కోట్లు సాయం చేస్తామని తెలిపారు. ఐఆర్సీటీసీలో వాటాలను విక్రయించి లిస్టింగ్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ చేయిస్తామని అన్నారు. ఆన్ లైన్లో రిజర్వేషన్ చేయించుకునే వారికి సర్వీస్ టాక్స్ ను మినహాయిస్తున్నట్టు తెలిపారు. మెట్రో రైళ్లకు మరింత ప్రాధాన్యమిస్తామని అన్నారు. రైల్వే కు సంబంధించి జైట్లీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
* రైల్వేలకు రూ. 1.31 లక్షల కోట్లు.
* అదనంగా మరో రూ. 55 వేల కోట్ల ప్రభుత్వ సాయం.
* 2020 నాటికి కాపలాలేని లెవల్ క్రాసింగ్ లు ఉండవు.
* వచ్చే నాలుగేళ్లలో అన్ని బ్రాడ్ గేజ్ మార్గాల్లో గేట్ల ఏర్పాటు.
* రైలు ప్రయాణికుల భద్రత కోసం వచ్చే ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల నిధి.
* 2019లోగా అన్ని రైల్వే కోచ్ లలో బయో టాయ్ లెట్ల ఏర్పాటు.
* 7 వేల రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ వినియోగం లక్ష్యం.
* ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే రైల్వే టికెట్ లకు సర్వీస్ చార్జ్ మినహాయింపు.
* దేశీయ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైల్ విధానం.
* మెట్రోల ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలకు పెద్దపీట.
* 2017-18లో 25 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.
* రైల్వేలు, రహదారులు, జల రవాణాకు రూ. 2,41,718 కోట్లు.