: రోజ్ వ్యాలీ స్కాం కీలక నిందితుడి మాజీ భార్యతో హోటల్లో దిగిన ఈడీ అధికారి.. సస్పెన్షన్ వేటు!
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు అయిన గౌతమ్ కుందు మాజీ భార్య సుభ్రతో కలసి ఈడీ విచారణ అధికారి మనోజ్ కుమార్ ఢిల్లీలోని హోటల్లో దిగిన వీడియో లీక్ కావడం... మరో సంచలనానికి కేంద్ర బిందువు అయింది. పశ్చిమబెంగాల్ లోని కొన్ని వార్తా చానళ్లు ఈ వీడియో ఫుటేజీని ప్రసారం చేశాయి. దీంతో, మనోజ్ కుమార్ ను ఈడీ సస్పెండ్ చేసింది. అయితే, ప్రాసిక్యూషన్ కు ఫిర్యాదు చేసేందుకే తాను ఢిల్లీ వెళ్లానని... సుభ్ర తన స్నేహితురాలు కావడంతో, ఆమెను తనతో పాటు తీసుకెళ్లానని మనోజ్ చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే తనపై బురద చల్లుతున్నారని.. తనను బాధితుడిని చేశారని ఆయన వాపోయారు. ఉన్నతాధికారుల అనుమతితోనే తాను ఢిల్లీకి వెళ్లానని చెప్పారు.