: కేంద్రప్రభుత్వం నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు!
కేంద్రప్రభుత్వం నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లు కురిసే అవకాశం కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులతోపాటు విభజన తర్వాత ఏపీకి వచ్చిన విద్యాసంస్థలకు నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహం లభించే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను(క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్)ను తొలగిస్తున్నట్టు జైట్లీ ప్రకటించనున్నట్టు సమాచారం.
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన వారికి ప్రభుత్వం మెట్టకు ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 250 గజాల వాణిజ్య ప్లాటు కేటాయించింది. అదే జరీబు భూములైతే వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ ప్లాటు ఇస్తోంది. రాజధాని నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో స్థలం విలువ భారీగా పెరుగుతుందని, రైతులు తమ వాటా ప్లాట్లను విక్రయించుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా తొలి విక్రయం ద్వారా వచ్చిన డబ్బుపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును మినహాయించాలని రాజధాని రైతులు తొలి నుంచి కోరుతున్నారు. గతేడాది రాజధాని ప్రాంతానికి వచ్చిన అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వద్ద కూడా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన కేంద్ర మంత్రి క్యాపిటల్ గెయిన్స్ పన్నును మినహాయించాలంటే ప్రత్యేకంగా చట్టం తీసుకురావాల్సి ఉంటుందని ఓ సందర్భంలో పేర్కొన్నారు. తాజాగా కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపును బడ్జెట్‌లో పెట్టాలని ఆర్థికమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతోపాటు బడ్జెట్‌లో ఏపీకి బోల్డెన్ని వరాలున్నట్టు సమాచారం. ఏపీకి పలు పరిశ్రమలు వచ్చే అవకాశంతోపాటు జాతీయ విద్యాసంస్థలకు నిధులు కూడా భారీగానే కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో.. నేటి బడ్జెట్‌లో మొత్తంగా ఏపీపై వరాల జల్లు కురిసే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.