: వారానికోసారి చేనేతలే ధరిస్తా... చేనేతను అంతర్జాతీయ బ్రాండ్ చెయ్యాలి: పవన్ కల్యాణ్


వచ్చేనెల గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనున్న చేనేత సత్యాగ్రహ సదస్సుకి ముఖ్యఅతిధిగా చేనేత సంఘాల నేతలు తనను ఆహ్వానించారని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని అన్నారు. తనను ఆహ్వానించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. చేనేత జాతి సంపద అని అన్నారు. చేనేత అరుదైన కళ అని, ఆ కళకు ప్రోత్సాహకాలిచ్చి, కార్మికులను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అంతే కాకుండా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని కూడా ఆయన సూచించారు.

చేనేతకు తనకు చేతనైనంత సాయం చెయ్యాలన్న ఆలోచన ఉంది కానీ, తనది పరిమితమైన నాలెడ్జ్ అని, దానిపై పలువురితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తనకు చేతనైనంత వరకు చేనేతను ప్రమోట్ చేస్తానని, అందులో భాగంగా ఇకపై వారంలో ఒకరోజు చేనేత దుస్తులే ధరిస్తానని, తనలాగే చేయమని పలువురికి సూచిస్తానని ఆయన చెప్పారు. అంతే కాకుండా మిలాన్ లాంటి నగరంలో కశ్మీరీ వర్క్ ను డిజైనర్లు కొనుగోలు చేస్తారని, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయగల మనవారి నైపుణ్యం వారికి అవసరం ఉంటుందని భావిస్తున్నానని, అలా చేనేతను అంతర్జాతీయ బ్రాండ్ గా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉందని ఆయన తెలిపారు. ఇందుకు తనకు చేతనైనంత చేస్తానని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News