: పార్లమెంటులో కుప్పకూలిన కేంద్ర మాజీ మంత్రి పరిస్థితి విషమం!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తోన్న సమయంలో కేరళకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఇ.అహ్మద్ అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితిపై వైద్యులు వివరాలు వెల్లడించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని మీడియాకు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు హృదయస్పందన, పల్స్ పడిపోయాయని తెలిపారు. ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించి తిరిగి గుండెకొట్టుకునేలా చెయ్యగలిగామని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.