: ట్రంప్ భూమికి వెళ్లబోనన్న యూఎస్ మహిళ... ఇక్కడే ఉండిపొమ్మని సుష్మా స్వరాజ్ అభయం
ప్రస్తుతం ఇండియాలో ఉంటున్న యూఎస్ మహిళ, తాను తిరిగి వెళ్లేందుకు నిరాకరిస్తున్న వేళ సుష్మా స్వరాజ్ పెద్దమనసుతో కల్పించుకుని ఆమెకు అభయమిచ్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుజరాత్ కు చెందిన 90 సంవత్సరాల వృద్ధురాలు కాంటాబెన్, తన చిన్న కుమారుడితో కలసి ఓక్లహామాలో స్థిరపడ్డారు. ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా వుంది. ఇటీవల ఆమె ఇండియాకు రాగా, ఆమె భారత వీసా గడువు తీరిపోయింది. తాను ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న భూమిపైకి వెళ్లలేనని, అక్కడకు వెళితే, తనతో మాట్లాడేవారు కూడా ఉండరని, మిగిలిన శేష జీవితాన్ని ఇండియాలోనే గడపాలని భావిస్తున్నానని అంటోంది.
గత సంవత్సరం నవంబరులో 72 గంటల వీసాతో ఇండియాకి వచ్చింది. ఆమె కథనాన్ని పత్రికలు వెలుగులోకి తేవడంతో, విషయం తెలుసుకున్న సుష్మా స్వరాజ్ స్పందించారు. ఆమె ఇండియా వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే ఉండవచ్చని, ఆమె సమస్యను వెంటనే పరిష్కరిస్తామని సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.