: తొలి మహిళ మెలానియా ఎక్కడుంది? వారం నుంచి కనిపించని ట్రంప్ భార్య!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యగా, దేశానికి తొలి మహిళగా ఉన్న మెలానియా ట్రంప్ కనిపించడం లేదు. గత వారం రోజులుగా ఆమె మీడియా ముందుకు రాకపోగా, మరెక్కడా కూడా ఆమెకు సంబంధించిన వార్తలు రాకపోవడం అమెరికాలో ఇప్పుడు తాజా చర్చ. తన భర్త ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాత్రమే మెలానియా కనిపించారు. ఆపై గత వారం రోజులుగా ఆమె దర్శనం లేదు.
కాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ నవ్వుతూ ఉన్న ఆమె, ట్రంప్ ఏదో మాట్లాడేసరికి చిన్నబుచ్చుకున్నట్టు ఓ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల తరువాత ఆమె వాషింగ్టన్ ను వదిలి న్యూయార్క్ కు వెళ్లారు. తన 10 సంవత్సరాల కుమారుడు బారన్ ట్రంప్ పాఠశాల విద్యను పూర్తి చేయాల్సి వున్నందున స్కూలు మార్చడం ఇష్టం లేకనే ఆమె వెళ్లినట్టు చెబుతున్నప్పటికీ, మరేదైనా కారణముందా? అని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తొలి మహిళగా ఆమె నుంచి మొదటి మీడియా సమావేశం కూడా ఇంకా జరగలేదన్న సంగతి తెలిసిందే.