: నా ప్రభుత్వం సాధించింది ఇదిగో!: ప్రణబ్ ముఖర్జీ


ప్రతి ఒక్కరికీ ఇల్లు, అందుబాటులో వైద్యం, నాణ్యమైన విద్యుత్ తదితర లక్ష్యాలను త్వరలోనే అందుకుంటామని ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఎన్నో స్కీములను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రజల కోసం 3 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చామని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్టు తెలిపారు.

పొగలేని వంటగదులు ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ఇప్పటికే 1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చామని, ఈ సంవత్సరం మరిన్ని ఇస్తామని అన్నారు. రైతులకు మరింత గిట్టుబాటు ధరను కల్పించేందుకు, వ్యవసాయ వృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకురానున్నామని ప్రణబ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.66 కోట్ల మంది రైతులు బీమా గొడుగు కిందకు వచ్చారని, అనుకోని ఘటనలు ఏర్పడి పంట నష్టపోతే, 1.4 లక్షల కోట్ల విలువైన బీమా వీరికి అండగా ఉండనుందని అన్నారు.

ప్రభుత్వ విధానాలు పేదలకు ఉపయోగపడుతున్నాయని, చిన్న వ్యాపారులకు గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహం లభిస్తోందని చెప్పారు. 18 వేల గ్రామాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యాన్ని అందించామని, 20 కోట్ల రూపే డెబిట్ కార్డులను పేదలకు అందించామని ప్రణబ్ ముఖర్జీ గుర్తు చేశారు. 20 కోట్లకు పైగా ఎల్ఈడీ బల్బులను పంచామని, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 5.6 కోట్ల మందికి రుణ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఉజ్వల్ యోజన ప్రయోజనాలు 37 శాతం షెడ్యూల్ కులాలకు దగ్గరైనాయని అన్నారు.

మహిళా శక్తిని తన ప్రభుత్వం గుర్తించిందని, వారి సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. భారత ఖ్యాతిని రియో ఒలింపిక్స్ లో మహిళలు ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ తదితరులు భారత స్త్రీ శక్తిని చాటారని అన్నారు. ఇప్పటికే భారత సైన్యంతో పాటు వాయు సేనలో యుద్ధ విమానాల పైలట్లుగానూ మహిళలు పని చేస్తున్నారని తెలిపారు. బాల బాలికల నిష్పత్తిలోనూ మెరుగైన గణాంకాలు వస్తున్నాయని ప్రణబ్ వెల్లడించారు. భ్రూణ హత్యలను నివారించేందుకు కఠిన చట్టాలను తీసుకువచ్చామని తెలిపారు.

భారత క్రికెట్ జట్టు అసమాన విజయాలను అందుకుంటోందని ప్రణబ్ తెలిపారు. క్రికెట్ తో పాటు మిగతా ఆటలకూ తన ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఆ ఫలాలు అందుతున్నాయని, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో సాధించిన పతకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నిత్యావసర వస్తువుల ధరలు దిగొచ్చాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

రూ. 12 వేల కోట్లతో ప్రారంభమైన ప్రధానమంత్రి సోషల్ వికాస్ యోజన విజయవంతమైందని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో కోటి మంది యువత ఈ పథకం కింద లబ్ధిని పొందనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 978 ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ లను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత తన ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే కేటాయించిన నిధుల మొత్తాన్ని తదుపరి బడ్జెట్ లో మరింతగా పెంచనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News