: అసలు నోట్లలో జిరాక్సు నోట్లు.. బంగారం కొంటూ పట్టుబడిన మహిళ!
చెన్నయ్‌లోని వన్నారపేట్టై, ముత్తయ్యమేస్త్రి వీధికి చెందిన పరమశివం అనే నగల వ్యాపారి దుకాణానికి వచ్చిన శివగామి అనే ఓ మహిళ షాపులో ఓ నగను ఎంపిక చేసుకుంది. అనంతరం బిల్లు చెల్లించేందుకు తన వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బయటకు తీసి ఇచ్చింది. అయితే, ఆ మహిళ రెండు వేల రూపాయల జిరాక్సు నోట్లను కూడా అందులో కలిపి ఇచ్చిందని నగల వ్యాపారి పరమశివం గ్రహించి ఆమెను పోలీసులకి పట్టించాడు. ఆ మహిళ ఇచ్చి నోట్లలో రెండింటిపై అనుమానం రావడంతో తాను వాటిని పరిశీలించానని, దీంతో అవి జిరాక్సు కాగితాలని తేలిందని పరమశివం చెప్పారు.
సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, తనకు దారిలో ఓ పర్సు దొరికిందని, అందులోనే ఈ నోట్లు లభించాయని చెప్పింది. ఆ పర్సులో తనకు మరో తెల్లకాగితం కూడా దొరికిందని దానిపై ‘సుజాత, కొడుంగయ్యూరు, కన్నదాసనగర్’ అనే ఓ చిరునామా ఉందని చూపించింది. అయితే, పోలీసుల విచారణలో మాత్రం ఆ అడ్రస్సులో ఎవ్వరూ కనిపించలేదు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.