: బీజేపీ, టీడీపీ విడిపోతే ఏపీ అభివృద్ధి ఆగిపోతుంది: వెంకయ్యనాయుడు
బీజేపీ, టీడీపీ విడిపోతే ఏపీ అభివృద్ధి ఆగిపోతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్నవ్యాఖ్యల నేపథ్యంలో ఏపీకి కేంద్రం తరపున లభించిన ప్రయోజనాలను ఒక పత్రికకు ఆయన వివరిస్తూ... ప్రత్యేక హోదా ద్వారా ఏడాదికి రూ.3500 కోట్లు మాత్రమే వస్తాయన్నారు. ప్రత్యేక హోదా అంశాన్నివిభజన చట్టంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చితే ప్రస్తుత సమస్య ఉండేది కాదన్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారని, ఇదే కనుక జరిగితే ఏపీ అభివృద్ధి ఆగిపోతుందన్నారు.
ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారని, త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ అంశం రెండు రాష్ట్రాలతో ముడిపడి ఉందన్నారు. ఏపీలో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని, సీఎం చంద్రబాబు ముందు చూపుతో వేల ఎకరాల భూమిని సేకరించారని చెప్పారు. 2019 వరకు ఓపిక పట్టాలని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సూచించారు.