: పోలీస్ బాస్ తనను వేధిస్తున్నాడంటూ హుస్నాబాద్ సీఐ ఆరోపణలు!


తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ ఇప్పుడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య ఆరోపించారు. ‘నేను ఇరవై రోజులుగా సిక్ లీవ్ లో ఉన్నాను. విధుల్లో చేరేందుకు వస్తుండగా.. ‘నీకు బదిలీ అయింది. నువ్వు స్టేషన్ కు వెళ్లొద్దు. జీపు వాడొద్దు’ అని ఏసీపీ ద్వారా శివకుమార్ ఒత్తిడి చేయిస్తున్నారు. నాకు బదిలీ ఆర్డర్ రాలేదు. నిబంధనల ప్రకారం, కొత్తగా సీఐ కి చార్జి అప్పగించిపోతాను అని చెప్పినప్పటికీ ఆయన నిరాకరించారు. పైగా, ఇక్కడ ఉండొద్దంటూ నన్ను మానసిక ఒత్తిడికి శివకుమార్ గురిచేశారు. నాపై ఆయన కక్ష పెట్టుకోవడానికి కారణం.. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనే.

 అప్పట్లో హైదరాబాద్ లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్ పై యూనిఫామ్ లో లేని కానిస్టేబుళ్లు దాడి చేశారు. దీంతో, నాడు పోలీస్ సంఘం కార్యదర్శిగా ఉన్న నేను అప్పటి డీజీపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. ఆ సమయంలో, కరీంనగర్ ఎస్పీగా ఉన్న శివకుమార్, నాకు రెండు చార్జి మెమోలు ఇచ్చి, సీఐడీకి బదిలీ చేశారు. అమరుల భవన నిర్మాణ అవకతవకలపై ఆర్టీఐ కింద లెక్కల విషయమై కూడా ప్రశ్నించాను.

ఈ నేపథ్యంలో నాపై ఆయన కక్ష పెంచుకున్నాడు.  ప్రభుత్వ వాహనం ‘టవేరా’ను సీపీ భార్య వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన భార్య  ప్రభుత్వ వాహనంలో తిరిగితే తప్పులేదా? సీనియర్ పోలీస్ ఉద్యోగిగా ఉన్న నేను, విధుల నిమిత్తం  ప్రభుత్వ వాహనం వాడుకోవడం తప్పా?’ అని హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో భూమయ్య ప్రశ్నించారు. కాగా, ఈ వేధింపుల విషయమై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు చొరవతో మళ్లీ హుస్నాబాద్ సీఐగా తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.

  • Loading...

More Telugu News