america: ట్రంప్ ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా.. వారికి 10,000 ఉద్యోగాలు ప్రకటించిన కాఫీ జెయింట్‌ స్టార్‌బక్స్


అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఇచ్చిన ఎన్నిక‌ల‌ హామీల అమ‌లుకు అడుగులు వేస్తూ ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులు, ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా ఇటీవ‌లే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా శ‌ర‌ణార్థుల‌కు అండ‌గా నిలుస్తూ కాఫీ జెయింట్‌ స్టార్‌బక్స్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. తాము వచ్చే ఐదేళ్లలో 10,000 మంది శరణార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామ‌ని ఆ కంపెనీ ఛైర్మన్‌, సీఈవో హోవార్డ్‌ షూల్జ్‌ కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కాఫీ స్టోర్లలో వారికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని, దానికి అమెరికా నుంచే చ‌ర్య‌లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

అమెరికా సైన్యానికి త‌మ‌ మద్దతు ఎప్పుడూ ఉంటుంద‌ని తెలిపిన హోవార్డ్‌ షూల్జ్‌...  ప్రస్తుతం త‌మ‌కు ఎప్పుడో ప్రసాదించిన పౌరసత్వాలకు, మానవ హక్కులకు ముప్పు పొంచి ఉన్నట్లు సూచ‌న‌లు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. వాటి గురించి ప్ర‌జ‌లు ఇప్ప‌టికే విని ఉంటారని తెలిపారు. త‌మ దేశ అధ్య‌క్ష‌ ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌కు హోవార్డ్‌ షూల్జ్‌ మద్దతు తెలిపారు. ట్రంప్ విధానాల‌ను వ్య‌తిరేకించారు.

  • Loading...

More Telugu News