: మోదీ బొమ్మను తొలగించి గాంధీజీ బొమ్మ పెట్టాలి: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
జాతిపిత మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... కేవీఐసీ క్యాలెండర్లపై ముద్రించిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించి మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ చర్య మోదీ అధికార అహంకార ధోరణికి తార్కాణమని ఆయన విమర్శించారు. మోదీ మెప్పు పొందడం కోసం, స్వలాభం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వల్ల రైతులకు అప్పులు దొరకడం లేదని, వారు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు. మరోపక్క సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని విలాసవంతమైన భవనాలు, విదేశీ పర్యటనలు, దేవుళ్ల మొక్కుల కోసం వినియోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.