: చెప్పిందే చేస్తున్నాం... పాకిస్థాన్ పైనా నిషేధం విధించే ఆలోచన ఉంది: వైట్ హౌస్
ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాపై కాలుమోపకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్న వేళ, ఓ వైపు నిరసనలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు తన నిర్ణయాలను ట్రంప్ సమర్థించుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలనే ప్రభుత్వం అమలు చేస్తున్నదని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ముస్లిం ఉగ్రవాదం, వలసవాదాలను ఆపాలన్నది ట్రంప్ హామీల్లో ముఖ్యమైనవని, ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికి మాత్రమే దక్కాలన్నది కూడా మరో కీలక హామీ అని గుర్తు చేసిన ప్రెస్ సెక్రటరీ, హామీలన్నీ అమలు చేసి తీరుతామని తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిన పాకిస్థాన్ పై కూడా నిషేధం విధించే ఆలోచన ఉందని, అంతకన్నా ముందు తమ భూభాగం నుంచి ఉగ్ర శిబిరాలను సమూలంగా నాశనం చేసేందుకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలన్నది ట్రంప్ అభిమతమని వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అణగదొక్కుతామని స్పష్టం చేశారు.