: పవన్‌కల్యాణ్‌తో సీపీఐ చెట్టాపట్టాల్.. జనసేనతో చేతులు కలుపుతామన్న రామకృష్ణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపేందుకు సీపీఐ సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో పవన్‌తో చేతులు కలుపుతామని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో పవన్‌తో చేతులు కలుపుతామని పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడిన రామకృష్ణ.. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీసే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదన్నారు. పవన్‌తో ఇప్పటికే చర్చలు జరిపామని, భవిష్యత్తులో ఆయనతో కలిసి ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.