: సెలవు అడిగితే ససేమిరా అన్న ఉన్నతాధికారులు.. డ్యూటీలోనే ఆగిన ఆర్టీసీ డ్రైవర్ గుండె.. రిటైర్మెంట్‌కు రెండు రోజుల ముందు విషాదం!
సెలవు అడగ్గానే ఇచ్చి ఉంటే ఆ డ్రైవర్ ప్రాణం నిలిచేదేమో! ఉన్నతాధికారులు కనికరం చూపి ఉంటే ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకుని ఉండేవి కావేమో. మరో రెండు రోజుల్లో రిటైర్ కాబోతున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడుపుతూనే ప్రాణాలొదిలాడు. గుండె నొప్పి బాధిస్తున్నా తన చేతిలో ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయని గుర్తించిన ఆయన బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన నిలిపి తనువు చాలించడం గమనార్హం. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చుండూరుకు చెందిన కొప్పోలు విష్ణు(58) నల్గొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్. ఈనెల 31న ఆయన విధుల నుంచి రిటైర్ కానున్నారు. దీంతో కుటుంబ సభ్యులు రిటైర్మెంట్ ఏర్పాట్లలో ఉన్నారు.
కాగా తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, సెలవు కావాలంటూ రెండు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న విష్ణుకు నిరాశే ఎదురైంది. అధికారులు ఆయన మొర వినలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో విధులకు హాజరయ్యారు. శనివారం చుండూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండ్రపల్లికి నైట్‌హాల్ట్ డ్యూటీపై వచ్చారు. ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం డ్యూటీ ఎక్కారు. కిలోమీటరు దూరం ప్రయాణించాక గుండెలో ఏదో తెలియని బాధ విష్ణును ఇబ్బంది పెట్టసాగింది.
దీంతో బస్సును రోడ్డు పక్కన ఆపిన ఆయన కాసేపటి తర్వాత మళ్లీ బస్సును స్టార్ట్ చేశారు. అయితే బాధ క్షణక్షణానికి ఎక్కువవుతుండడంతో సీటు దిగారు. ఆ వెంటనే అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే విష్ణును చుండూరు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. విష్ణు జేబులో ఐడీకార్డుతోపాటు సెలవు చీటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేయకపోవడం వల్లే విష్ణు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు చుండూరులో రాస్తారోకో నిర్వహించారు.