: 'సెల్‌ఫోన్ కొనివ్వలేదు.. అమ్మను అరెస్ట్ చేయండి'.. పోలీస్ స్టేషన్లో బాలుడి ఫిర్యాదు!
సెల్‌ఫోన్‌పై ఉన్న ప్రేమ ఓ బాలుడిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది. ఫోన్ కొనివ్వని అమ్మను అరెస్ట్ చేయాలంటూ బాలుడు చేసిన ఫిర్యాదును చూసి పోలీసులే అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తూత్తుకుడి ముత్తయ్యపురం ప్రభుత్వ పాఠశాలలో గణేశ్ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఏడుస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాలుడు తల్లిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను కోరాడు. దీంతో బాలుడిని బుజ్జగించిన పోలీసులు నెమ్మదిగా ఆరాతీశారు.
సెల్‌ఫోన్ కొని ఇవ్వమంటే అమ్మ కొనివ్వడం లేదని, ఆమెను అరెస్ట్ చేయాలని కోరాడు. అంతేకాదు.. అరెస్ట్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో కంగుతిన్న పోలీసులు గణేశ్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. తమకు సెల్‌ఫోన్ కొనే స్తోమత లేదని, చెబితే అర్థం చేసుకోవడం లేదని వారు పోలీసులకు తెలిపారు. అయినా బాలుడు బెట్టువీడకపోవడంతో హెచ్చరించి ఇంటికి పంపారు.