: అమరావతిలో భూములు కొన్నదెవరు? చంద్రబాబు బినామీలు కాదా? అని ప్రశ్నిస్తున్నా..!: జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. ద్వారకాతిరుమలలో జగన్ సమక్షంలో కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహరంగ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రులు, చంద్రబాబు బినామీలే భూములు కొన్నారని ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో అవినీతిలో ఏపీ నెంబర్ వన్‌గా ఎదిగిందన్న జగన్, పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచేశారన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభ పెట్టి తమ పార్టీలో చేర్పించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే వారితో రాజీనామా చేయించి, ప్రజల్లోకి వెళ్లాలని సవాలు విసిరారు. బాబు పాలనతో అవినీతి తారస్థాయికి చేరిందని విమర్శించారు. అవినీతికి భయపడి కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారన్నారు. రైతుల భూములను ఎలా లాక్కోవాలన్న ఆలోచన తప్ప వారికి మేలు చేద్దామన్న ఆలోచన చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు.