: మెరీనాలో మళ్లీ ఆందోళనలు?.. వచ్చే నెల 12 వరకు తీరంలో 144 సెక్షన్
జల్లికట్టు ఉద్యమానికి కేంద్రబిందువైన చెన్నైలోని మెరీనా బీచ్‌లో మరోమారు ఆందోళనలు జరిగే పరిస్థితి కనిపిస్తుండడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముందుజాగ్రత్త చర్యగా శనివారం అర్ధరాత్రి నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించింది. ఈమేరకు చెన్నై అదనపు పోలీస్ కమిషనర్‌లు కె.శకంర్, ఎస్ఎన్ శేషసాయి విలేకరులకు తెలిపారు.
అయితే మార్నింగ్ వాక్‌కు వచ్చేవారిని, సందర్శకులను ఇబ్బంది పెట్టబోమని, అనుమానితులను మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నేడు(ఆదివారం) మెరీనా తీరంలో చేపట్టనున్న మానవహారానికి మద్దతు కోరుతూ కొందరు అల్లరి మూకలు సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించినట్టు కమిషనర్లు తెలిపారు. అలాగే మైలాపూర్, ట్రిప్లికేన్, పట్టినబాక్కం ప్రాంతాల్లో కూడా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.