: తల్లిని ఓడించారని విశాఖపై జగన్ కక్ష పెట్టుకున్నారు.. జ్యోతిష్యులపై ఉన్న నమ్మకం ప్రజలపై లేదు.. ప్రతిపక్ష నేతపై టీడీపీ మాటల తూటాలు
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు మరోమారు విరుచుకుపడ్డారు. తల్లిని ఓడించిన విశాఖపట్టణంపై ఆయన కావాలనే కక్ష పెట్టుకున్నారని, విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ధ్వజమెత్తారు. కడపలో మాట్లాడిన ఆయన జగన్‌కు సీఎం పదవి పిచ్చి పట్టుకుందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైనా రాష్ట్రానికి ఒక్కరే ముఖ్యమంత్రి ఉంటారని, ఒకే సమయంలో ఇద్దరు ఉండరని అన్నారు. జగన్ తనను తాను ముఖ్యమంత్రిగా ఊహించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్‌కు జ్యోతిష్యులపై ఉన్న నమ్మకం ప్రజలపై లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు పిచ్చిముదిరిందని, ఈ ఏడాదే సీఎం అవుతానని కలలు కంటున్నారని అన్నారు. విశాఖ సదస్సును అభాసుపాలు చేయడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు జగన్ కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. చిన్నప్పుడు ఆయనను ఎలా పెంచారో వైఎస్ ఆత్మ కేవీపీకే తెలుసని పేర్కొన్నారు.