: ఆ అధికారికి ఇంగ్లిష్ రాకపోవడం వల్ల రూ.2 కోట్ల నష్టం జరిగింది!
జపాన్ రాజధాని టోక్యోలోని షింజుకు గ్యియాన్ పార్కు అడ్మినిస్ట్రేటివ్ అధికారి తనకు ఇంగ్లిష్ రాని కారణంగా రెండేళ్లుగా విదేశీ పర్యాటకుల వద్ద ప్రవేశ రుసుం వసూలు చేయలేదు. దీంతో పర్యాటక శాఖకు సుమారు రూ.2 కోట్లు నష్టం వచ్చింది. వివరాలు చూస్తే... ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు వచ్చే ఆ పార్కులో పనిచేస్తోన్న అధికారికి ఇంగ్లిష్ అంతగా రాదు. రెండేళ్ల క్రితం ఓ విదేశీ పర్యాటకుడిని ప్రవేశ రుసుం చెల్లించమని ఆయన అడగగా, ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేదని ఆ పర్యాటకుడు ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరిచాడు.
దీంతో ఇంగ్లిష్ రాని ఆ అధికారి ఎంతో బాధపడడంతో పాటు భయపడిపోయాడు. మళ్లీ తనపై విదేశీయులు ఆగ్రహం తెచ్చుకోకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు విదేశీ పర్యాటకుల నుంచి ప్రవేశ రుసుం తీసుకోవడం లేదు. ఆ విధంగా రెండేళ్లలో పార్కులోకి 1.6లక్షల మంది విదేశీ సందర్శకుల్ని ఫ్రీగా పంపించాడు. తాజాగా సదరు పార్కు అకౌంట్స్ సోదాలు చేసినప్పుడు పై అధికారులకు ఈ విషయం తెలిసింది. సదరు అధికారిని వారు నిలదీయగా తనకు వచ్చే రిటైర్‌మెంట్ ఫండ్‌లో సగం ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే, ఉన్నతాధికారులు ఒక నెల జీతంలో 10 శాతం కోత మాత్రమే విధించి, ఇంకోసారి ఇలా చేయకూడదని మందలించి ఆయనను విడిచిపెట్టారు.