: రిపబ్లిక్ డే నాడు పవన్ కల్యాణ్ దీక్షకు వచ్చి ఉంటే బాగుండేది: చలసాని
రిపబ్లిక్ డే నాడు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలనుకున్న ప్రత్యేక హోదా మౌన దీక్షకు సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చివుంటే బాగుండేదని ప్రత్యేక హోదా సాధనసమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నప్పటికీ ఆయన అక్కడే దీక్షను కొనసాగించాల్సిందని అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని తాము ఎన్నోసార్లు చెప్పామని, ఇప్పుడు కూడా చెబుతున్నామని ఆయన అన్నారు.
అయితే, ఒక్క ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే సరిపోదని, విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుకావాల్సిందేనని చలసాని అన్నారు. తాము వచ్చేనెల 9 నుంచి ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న దీక్షకు కళాకారుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రాన్ని ఘోరంగా విడగొట్టారని, ఏపీకి ఎంతో అన్యాయం చేశారని, రాష్ట్రం మళ్లీ కోలుకోవాలంటే హోదా రావాలని ఆయన అన్నారు.