: నిజాలు మాట్లాడతా కాబట్టే ఎదురుదెబ్బలు.. హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు తనయుడు హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిజాలు మాట్లాడతాను కాబట్టే తనను వెనకన పెట్టారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని నరసింహాపురంలో సీసీ రోడ్డును హరికృష్ణ ప్రారంభించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీంతో నిర్మాణం పూర్తయిన రోడ్డును ప్రారంభించాల్సిందిగా గ్రామస్తులు ఆయనను ఆహ్వానించారు. వారి కోరికపై రోడ్డును ప్రారంభించిన హరికృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాలు మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల తనకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. అయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలుగువాడికి గౌరవం తీసుకొచ్చిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం గ్రామస్తులు హరికృష్ణను ఎద్దుల బండిపై ఊరేగించారు.