: తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పి... 'ప్యాకేజీయే బెస్టు' అన్న సుజనా చౌదరి!


ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే ఈపాటికే దాని కాలపరిమితి ముగిసి ఉండేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇచ్చిన ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసిందని, అలాగే స్టేటస్ కాలపరిమితి కూడా ముగిసి ఉండేదని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజీ రావడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని అన్నారు. ప్రత్యేకహోదా వల్ల పన్ను రాయతీలు రావని, హోదా వల్ల ప్రత్యేక రాయతీలు వస్తాయనేది అపోహ అని ఆయన చెప్పారు.

హోదా ఉంటే కంపెనీలు పెట్టుబడులు పెట్టేస్తారనేది ప్రతిపక్షాల తప్పుడు ఆలోచన అని అన్నారు. పార్లమెంటులో రాష్ట్రానికి లాభం కలిగేలా పని చేస్తున్నామని, ఢిల్లీలో తాము ఎంజాయ్ చెయ్యడం లేదని ఆయన చెప్పారు. ఎన్డీయేకు మిత్రపక్షమైనా తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడుతున్నామని ఆయన తెలిపారు. హోదా ప్రకారం అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రంతో పాటు కేంద్రం 40:60 నిధులు వెచ్చించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని ఆయన తెలిపారు.

జల్లికట్టుతో ప్రత్యేకహోదాను పోల్చడం వల్ల తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. తాను గత 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని ఆయన తెలిపారు. అందువల్ల తనకు అప్పుతీసుకునే హక్కు ఉందని ఆయన చెప్పారు. ఈ 30 ఏళ్లలో ప్రభుత్వానికి సేల్స్, ఎక్సైజ్, ఇంకా ఎన్నో ట్యాక్సులు కట్టానని ఆయన తెలిపారు. ఆ క్రమంలో ఇన్నేళ్లలో ఎవరూ తనను ప్రశ్నించలేదని ఆయన చెప్పారు. పారిశ్రామిక వేత్త ఎవరైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు వడ్డీలు చెల్లించడం ఒకరోజు ముందు లేదా వెనుక అవుతుందని, దానిని చీప్ గా మాట్లాడడం సరికాదని ఆయన హితవు పలికారు. అలా కాకుండా తాము ఎవరికైనా ఒక్కరూపాయి అన్యాయం చేశామని తేలితే అప్పుడు ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఆర్ధిక నేరాలు వేరు, ఆర్థిక ఇబ్బందులు వేరని గుర్తించాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

వ్యక్తిగత విమర్శల వల్ల ఇతరులపై గౌరవం పోతుందని ఆయన తెలిపారు. రాజకీయాలు, వ్యాపారం వేరుగా చూడాలని ఆయన సూచించారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో తాను వ్యాపార లబ్ధి పొందలేదని ఆయన స్పష్టం చేశారు. లేదు తాను తప్పులు చేశానని ఎవరైనా నిరూపిస్తే ముందకు రావాలని సవాల్ విసిరారు. ఇకపై ఎవరైనా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నామని, అలాంటి తమపై అరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. 

  • Loading...

More Telugu News