: రాహుల్ ద్రవిడ్ ను అభినందించిన గంభీర్
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ను క్రీడారంగ ప్రముఖులు అభినందిస్తున్నారు. క్రికెట్ లో సిద్ధూ, సచిన్, గంగూలీ, సెహ్వాగ్ వంటి సమకాలీనులంతా ఎదురు దాడిని ఎంచుకుని క్రికెట్ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలు నింపుకోగా, వారికి విభిన్నంగా రక్షణాత్మక దూకుడును ఎంచుకుని విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన క్రికెటర్ గా రాహుల్ ద్రవిడ్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. గౌరవ డాక్టరేట్ అందిస్తామని ముందుకు వచ్చిన బెంగళూరు యూనివర్సిటీ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్, క్రీడల్లో సొంతగా పరిశోధన చేసి, నిజమైన డాక్టరేట్ తీసుకుంటానని ప్రకటించాడు.
ఈ నిబద్ధతకు క్రీడాప్రపంచం మొత్తం రాహుల్ ద్రవిడ్ కు నీరాజనాలు పలుకుతోంది. దీనిపై తాజాగా సహచరుడిగా ఉన్న గౌతమ్ గంభీర్ స్పందించాడు. బెంగళూరు యూనివర్సిటీ ప్రతిపాదించిన గౌరవ డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించిన ద్రవిడ్ ను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నాడు. అతను పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకుంటానంటున్నాడు. అదే సరైన నిర్ణయమని గంభీర్ కొనియాడాడు. దీనిపై క్రికెటర్లంతా ద్రవిడ్ ను అభినందిస్తున్నారు.