: ప్రియురాలిని ఇరికించబోయి అడ్డంగా బుక్కయిన ప్రియుడు!
ప్రియురాలిపై కక్ష పెంచుకుని ఆమెపై పగతీర్చుకుందామని భావించిన ప్రియుడు అడ్డంగా బుక్కయిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వెజల్ పూర్ కు చెందిన దినేశ్ ప్రజాపతి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అందుకు అంగీకరించడంతో ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. అయితే కొన్నాళ్లకు ఆమె ఇలా ఎంతకాలం? అని ప్రశ్నించి, వివాహం చేసుకోవాలని కోరింది. దీంతో వివాహం మాట ఎత్తవద్దని, జీవితాంతం బంధం కొనసాగిద్దామని ప్రతిపాదించాడు. దానికి ఆమె నిరాకరించింది. అంతటితో ఆగని ఆమె తనను మోసం చేశాడని ఆరోపిస్తూ, దినేశ్ పై అత్యాచారం కేసు పెట్టింది.
దీంతో ఆమెపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన దినేశ్ 3 లక్షల విలువ చేసే 580 గ్రాముల మత్తుపదార్థాలు కొనుగోలు చేసి, ఎవరికీ తెలియకుండా ఆమె నివాసంలో ఉంచాడు. అనంతరం ఇన్ఫార్మర్ నెపంతో పోలీసులకు ఫోన్ చేసి, నిషేధిత మత్తుపదార్థాలు ఆ యువతి నివాసంలో ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె నివాసాన్ని సోదా చేసి, సదరు నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఆమె కుటుంబ సభ్యులను విచారించగా, వాటి సంగతి తమకు తెలియదని, తమపై కక్ష సాధింపు కోసం ఎవరో ఈ పని చేశారని చెబుతూ, తాము పెట్టిన అత్యాచారం కేసు విషయం కూడా పోలీసులకు తెలిపారు. దీంతో మరింత లోతుగా విచారించిన పోలీసులు, తమకు సమాచారం ఇచ్చిన ఫోన్ నెంబర్ వైపు విచారణ ప్రారంభించారు. దీంతో బయటపడ్డ దినేశ్ ప్రజాపతి విచారణలో తానే డ్రగ్స్ పెట్టినట్టు, ఆమెను ఇరికించాలని పెట్టినట్టు అంగీకరించాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.