: ప్రతి ఆన్ లైన్ లావాదేవీకీ పన్ను... బడ్జెట్ స్నేహపూర్వకం కాదు!
నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజానీకానికి ఊరట కలిగిస్తూ, వచ్చే వారంలో పార్లమెంటు ముందుకు రానున్న బడ్జెట్ లో పలు సానుకూలాంశాలు ఉంటాయని భావిస్తున్న ప్రజలకు నిరాశ కలిగించేలా కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ మనీని పూర్తిగా రూపుమాపడంలో భాగంగా ప్రతి ఆన్ లైన్ లావాదేవీపై పన్ను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఖజానాకు మరింత ధనాన్ని చేకూర్చుకోవడమే లక్ష్యంగా, కార్డులు, ఆధార్ వాడుతూ జరిపే కొనుగోళ్లపై పన్నును విధించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో నాటకీయ నిర్ణయాలు చోటు చేసుకోవచ్చని, భారత ఆర్థిక వ్యవస్థలో నగదు కొరత ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఎవరూ ఊహించని నిర్ణయాలను కేంద్రం తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రాన్సాక్షన్ టాక్స్ తో పాటు, డెరివేటివ్ లావాదేవీలు, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులను కేంద్రం కొత్తగా వేయవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. అదే జరిగితే, గతంలో స్థిర, చరాస్తులు లేదా కంపెనీలో షేర్లు తదితర ఆస్తులను అమ్మి, ఆపై ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి లాభపడి, ఇప్పుడు వాటిని అమ్మే వారిపైనా పన్ను భారం పడ్డట్టే.
ఇక మరో మూడు నాలుగు నెలల్లో జీఎస్టీ అమలు కానున్న నేపథ్యంలో, పలు కొత్త నిబంధనలనూ విధిస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకోవచ్చని, 'పరోక్ష బదలాయింపు' పేరిట కొత్త పన్నులను కేంద్రం ప్రజలపై మోపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే డబ్బులపై కేంద్రం కన్నేసిందని, వివిధ దేశాల నుంచి తమవారికి వచ్చే నిధులపై పన్నులను వసూలు చేయవచ్చని తెలిపారు.