: ప్రసాదించడమేంటి వెంకయ్యా... మీరేమైనా దేవుళ్లా?: పవన్ ఎద్దేవా
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటతీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "వెంకయ్యనాయుడుగారి పదజాలం ఎలా ఉంటుందంటే... స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాలు కాదు. పది సంవత్సరాలు ప్రసాదిస్తామంటారు. ప్రసాదించడానికి మీరేమైనా దేవుళ్లా? దిగొచ్చరా? మీరు అందరిలాంటి మనుషులు కాదా? ప్రత్యేకించి దిగొచ్చారా? ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పైనుంచి దిగొచ్చామనుకుంటున్నారా? మేమందరం మీ బానిసలమా? ఏమనుకుంటున్నారు? మేమీ దేశ ప్రజలం. మీ ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఒక రోజు ఒకమాట చెప్పి, మరోరోజు ఇంకో మాట చెబితే ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు, ప్రజలం కాదు, మనుషులం కాదు" అని పవన్ ఆవేశంగా మాట్లాడారు.
దయచేసి తమ బాధను అర్థం చేసుకోవాలని, నోటికి ఇష్టం వచ్చినట్టు, నాలుకకు మడతే లేనట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 'రామమందిరం అనే గుడి గురించి మాట్లాడతారు గానీ, నాలుగు కోట్ల మంది ప్రజల సమస్యను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఎందుకో తెలియడం లేద'ని పవన్ అన్నారు.