: మోదీ, బాబు వచ్చాక అన్నీ సమస్యలే... ఈ ఒంటెద్దు పోకడలెందుకు?: పవన్ వాగ్బాణాలు
బీజేపీ, టీడీపీలు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిందని గుర్తు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఈ మూడేళ్లూ దేశం సమస్యల్లో చిక్కుకుపోవడం మినహా మరేమీ లాభాలను పొందలేదని విమర్శించారు. అటు నరేంద్ర మోదీ, ఇటు చంద్రబాబులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గొడవలు, రోహిత్ వేముల ఘటన, నోట్ల రద్దు వంటి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడించాయని చెప్పారు.
ప్రతి విషయంలోనూ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ఇది తనకు ఎంతో బాధను కలిగిస్తోందని అన్నారు. తాను బీజేపీని, ఆ పార్టీ నాయకులను ఎంత అర్థం చేసుకుందామని అనుకున్నా, మింగుడు పడట్లేదని పవన్ అన్నారు. వారు అనుకున్నది చేస్తున్నారే తప్ప, ప్రజల మనోభావాలను గురించి పట్టించుకోవడం లేదని, ఇదెంతో బాధాకరమని చెప్పుకొచ్చారు.