: వారిని తీసుకెళ్లి అక్కడ వదిలేస్తే ఆ బాధ తెలుస్తుంది.. జనసేన మిత్రపక్షమా? కాదా? అన్న ప్రశ్నకు తావులేదు: చంద్రబాబు
పెట్టుబడుల కోసం దావోస్లో పర్యటిస్తే విహారయాత్రకు వెళ్లానని విపక్షనేతలు విమర్శిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో దావోస్ లో కష్టపడితే తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారిని అక్కడకు తీసుకెళ్లి ఆరు నెలలు వదిలేస్తే గడ్డకట్టుకుపోయే చలిలో ఆ బాధేమిటో తెలుస్తుందని పేర్కొన్నారు. గత భాగస్వామ్య సదస్సు వల్ల, ఆ తర్వాత అలుపెరగకుండా చేసిన ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి రూ.5.03 లక్షల కోట్ల విలువైన 927 ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని తెలిపారు. వీటిలో రూ.2.82 లక్షల కోట్ల విలువైన 659 ప్రాజెక్టులు ఆచరణలోకి వచ్చినట్టు వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రిపబ్లిక్ డేనాడు నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం తప్పేనని పేర్కొన్న చంద్రబాబు, జనసేన తమకు మిత్ర పక్షమా? కాదా? అన్న ప్రశ్నకు తావు లేదన్నారు.