: మే 1 నుంచి రాష్ట్రంలో పాలిథిన్ సంచుల వాడకం నిషేధిస్తున్నాం: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్


మే 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాలిథిన్ సంచులపై నిషేధం విధిస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆవులు, ప్రకృతిని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పాలిథిన్‌ సంచుల వాడకం వలన ప్రకృతికి అపారనష్టం వాటిల్లుతోందని తెలిపారు. పాలిథిన్ సంచులను తినడం వలన అధిక సంఖ్యలో ఆవులు మృత్యువాత పడుతున్నాయని ఆయన చెప్పారు. అందుకే నిషేధం విధించామని అన్నారు.

 మే 1 తర్వాత ఎవరూ వీటిని వాడేందుకు అనుమతి లేదని తెలిపిన ఆయన, దీనిపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా గతేడాది జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులను ఆయన అభినందించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో కీలకమైందని, దానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మోదీ ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గవర్నర్‌ ఓమ్‌ ప్రకాశ్‌ కోహ్లీ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News