: ఇక స్వర్ణముఖి, వంశధార నదులను కలుపుతాం: ఏపీ గణతంత్ర వేడుకల్లో గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి దిశగా దూసుకుపోతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. 12.23 శాతం ప్రగతి రేటును ఏపీ సాధించిందని తెలిపారు. సంక్షేమ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తోందని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని పూర్తి చేశామని తెలిపారు. 2018 నాటికల్లా స్వర్ణముఖి, వంశధార నదులను కలపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, పై వ్యాఖ్యలు చేశారు.