: మంత్రి రావెలపై చంద్రబాబు ఫైర్.. నువ్వెవరో తెలియకున్నా పదవులిస్తే చేసేది ఇదా..? అంటూ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి రావెల కిశోర్‌బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అతనెవరో కూడా తెలియకపోయినా పదవులిస్తే ఇప్పుడు రచ్చకెక్కి పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో పార్టీ రాష్ట్ర సమన్వయ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రావెల కిశోర్‌బాబు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జానీమూన్ మధ్య విభేదాలు రచ్చకెక్కడంపై చంద్రబాబు ప్రస్తావిస్తూ రావెలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రావెలను ఉద్దేశించి ఎన్నికల ముందు వరకు ''నువ్వెవరో నాకు తెలియదు. నిన్నెవరో నా వద్దకు తీసుకొస్తే టికెట్ ఇచ్చా. జానీమూన్ కూడా ఎవరో తెలియదు. ఆమెను నువ్వు, పుల్లారావు కలిసి తీసుకొచ్చారు. మీరు చెప్పారు కాబట్టి ఆమెను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను చేశా. ఇప్పుడు మీరిద్దరూ గొడవపడి పార్టీ పరువును బజారుకు ఈడుస్తారా? కొత్తగా పదవులు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కానీ మీరు విఫలమయ్యారు''.. అని చంద్రబాబు ఫైరయ్యారు. సీనియర్లు అయిన యనమల రామకృష్ణుడు, చినరాజప్ప వంటి వారిని చూసి నేర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణ విషయంలో తాను రాజీపడబోనని హెచ్చరికలు జారీ చేశారు.