: తన వెబ్ సైట్ కు రూ.42 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన కుర్రాడు!
ఇంగ్లాండ్ లోని యార్క్ షైర్ డ్యూస్ బర్రీకి చెందిన పదహారేళ్ల కుర్రాడి పేరు మహ్మద్ అలీ. గతంలో ‘ప్రాజెక్టు 2006’తో ఒక వీడియో గేమ్ ను రూపొందించి ముప్ఫై వేల యూరోలను అలీ గెలుచుకున్నాడు. తాజాగా, ప్రైస్ కంపారిజన్ పేరిట ధరలను పోల్చి చూసే ‘వీనీడ్1.కామ్’ అనే వెబ్ సైట్ ను రూపొందించాడు. దీనిని రూపొందించడానికి అలీ అంతగా శ్రమపడలేదు. ఆడుతూ పాడుతూ తన గదిలోని కంప్యూటర్ లోనే ఈ వెబ్ సైట్ ను రూపొందించేశాడు.
ఇప్పుడీ వెబ్ సైట్ ను తమకు ఇమ్మంటూ ప్రపంచ స్థాయి సంస్థ రూ. 42 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అయితే, ఈ ఆఫర్ తనకు నచ్చలేదంటూ అలీ తిరస్కరించాడు. ఆ ఆఫర్ ను తిరస్కరించడానికి గల కారణాన్ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ వివరిస్తూ.. ‘లండన్ లో పెట్టుబడిదారులను మేము కలిశాం. నేను రూపొందించిన వెబ్ సైట్ కు అవసరమైన టెక్నాలజీ అంతా నేనే తయారుచేసుకున్నాను అని చెబితే వారు నమ్మలేదు. వినియోగదారులకు అందుబాటులోకి రాకముందే నేను రూపొందించిన ఈ వెబ్ సైట్ కు ఇంత డిమాండ్ ఉందంటే, అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని విలువ ఏ విధంగా ఉంటుందో ఊహించుకున్నా. అందుకే, ఆ ఆఫర్ ను తిరస్కరించాను’ అని చెప్పుకొచ్చాడు.
కాగా, ఈ నెల 28న ‘వీనీడ్1.కామ్’ వెబ్ సైట్ ను ఆవిష్కరించనున్నారు. ఈ వెబ్ సైట్ రూపకల్పనలో అలీకి క్రిస్ తార్పే అనే అరవై ఏళ్ల వ్యక్తి వ్యాపార భాగస్వామిగా వ్యవహరించారు.