: నిరసన దీక్షకు అనుమతించకపోతే విద్యార్థుల్లో అశాంతి రగులుతుంది: పవన్ కల్యాణ్
విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ లో ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘మౌన నిరసన’ కు తన ట్విట్టర్ వేదిక ద్వారా పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయమై ఇంతవరకూ తమను ఎవరూ సంప్రదించలేదని, ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లేదని, ఒకవేళ ఇప్పుడు అడిగినా బందోబస్తు ఏర్పాటు చేయలేమని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. నిరసన దీక్షకు అనుమతించకపోతే విద్యార్థుల్లో అశాంతి రగిలే అవకాశముందని, శాంతియుతంగా నిరసన తెలియజేయడం యువత హక్కు అని పవన్ పేర్కొన్నారు. విశాఖలో యువత నిరసన దీక్షకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, ఈ నిరసన దీక్ష రాజకీయాలకు అతీతమైందని, హామీల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేయడం దేశ పౌరులుగా వారి హక్కు అని పవన్ పేర్కొన్నారు.