: ట్రంప్ కట్ చేసిన కేకుపై నెటిజన్ల సెటైర్లు!
అమెరికా అధ్యక్షులందర్లోకీ డిఫరెంట్ గా ఉండాలని భావించే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కట్ చేసిన తొలికేక్ సోషల్ మీడియాలో విమర్శలు మూటగట్టుకుంది. అమెరికాకు అధ్యక్షుడంటే ప్రపంచానికి పెద్దన్నలెక్క. అలాంటి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసే ఏర్పాట్లన్నీ ఘనంగా ఉంటాయి. ప్రమాణ స్వీకారం అనంతరం కుటుంబంతో కలిసి ‘శాల్యూట్ టు అవర్ ఆర్మ్డ్ సర్వీసెస్ బాల్’లో ట్రంప్ ఉపాధ్యక్షుడు పెన్ తో కలిసి సందడి చేశారు. అక్కడ డాన్స్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడితో కలిసి పెద్ద కత్తితో కేక్ కట్ చేశారు.
కాగా, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో సారి పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రముఖ చెఫ్ డఫ్ గోల్డ్ మన్ ఓ కేక్ ను తయారు చేశారు. అచ్చం అలాంటి కేక్ నే ట్రంప్ కోసం ఇప్పుడు తయారు చేయించడం విశేషం. దీంతో ట్రంప్ కట్ చేసిన కేక్.. ఒబామాకు తాను తయారు చేసిన కేక్ ఒకేలా ఉన్నప్పటికీ, ట్రంప్ కేక్ ను మాత్రం తాను తయారు చేయలేదని చెఫ్ గోల్డ్ మన్ ట్వీట్ చేస్తూ ఓ పుల్లవిరుపు మాట వేశారు.
అంతే.. సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్ టీమ్ ను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో దీనిని తయారు చేసిన బట్టర్ క్రీమ్ కేక్ షాప్ యజమాని మాట్లాడుతూ, తమకు ఒక కేక్ ఫోటో తెచ్చి చూపించి, అచ్చం అలాంటి కేక్ కావాలని అడిగారని, దానినే తాము తయారు చేశామని చెప్పారు. దీంతో ట్రంప్ అప్పుడే ఒబామాను అనుకరించడం మొదలుపెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు.