: టీడీపీ నేత జేబులో పేలిన శాంసంగ్ ఫోన్!
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, ఓ టీడీపీ నేత జేబులో ఉన్న శాంసంగ్ పేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండల టీడీపీ కన్వీనర్ చలపతి తన శాంసంగ్ ఫోన్ ను జేబులో ఉంచుకున్నారు. అకస్మాత్తుగా అది పేలిపోయింది. చిన్నపాటి మంట, పొగ రావడంతో పాటు శబ్దం కూడా వచ్చింది. దీంతో ఆయన వెంటనే జేబులో నుంచి ఫోన్ ను తీసి, విసిరేశారు. ఈ ఘటనలో ఆయన చొక్కా కూడా కొంత కాలిపోయింది. సెల్ ఫోన్ పూర్తిగా కాలిపోయింది.
బళ్లారిలోని ఓ షోరూమ్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయగా... ఇప్పటి వరకు ఆయన కుమారుడు ఈ ఫోన్ ను వాడాడు. కుమారుడికి ఇటీవల కొత్త ఫోన్ కొనిచ్చిన చలపతి... ఈ ఫోన్ ను తాను తీసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, నిన్న ఒక్కసారిగా అది పేలిపోయింది. జరిగిన ఘటనతో చలపతి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఫోన్ ముక్కలను సదరు షోరూమ్ కు అప్పగించినట్టు చలపతి తెలిపారు.