: ఒకే రోజు విశాఖలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఏం జరగనుంది?
జనవరి 26... ప్రస్తుతం అందరి దృష్టి ఆ రోజు మీదే ఉంది. కారణం... ఆ రోజు ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలోని ఆర్కే బీచ్ లో ఆందోళనకు రంగం సిద్ధమవుతోంది. హోదా కోసం ఏపీ యువత ఏకమవుతోంది. పార్టీలకు అతీతంగా శాంతియుతంగా చేపట్టే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత హాజరుకావాలంటూ... గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నిరసనకు జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో, పోలీసులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ హాజరవుతున్నారు.
మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు విశాఖలో ఉండనున్నారు. మరుసటి రోజు నుంచే ప్రతిష్టాత్మక సీఐఐ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో, ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం పోలీసులకు కత్తి మీద సామే. అయితే, నిరసన కార్యక్రమం అనుమతి కోసం ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఓవైపు నిరసన కార్యక్రమం జరుగుతుంటే... అక్కడే ఉన్న ముఖ్యమంత్రికి ఇది ఇబ్బందికర అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.