: హిరాఖండ్ రైలు ప్రమాదానికి కారణం సడన్ బ్రేక్? .. విశ్లేషిస్తున్న సీనియర్ అధికారులు!
విజయనగరం జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కారణం సడన్ బ్రేకేనని సీనియర్ రైల్వే అధికారులు చెబుతున్నారు. లోకోపైలట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రధానమార్గంలో రైలు వెళ్తున్నప్పుడు లోకోపైలట్ సడన్‌గా బ్రేకు వేయడం ముమ్మాటికీ తప్పేనని ట్రైన్స్ పాసింగ్ ఆపరేషన్ విభాగంలో ముఖ్య రవాణా అధికారిగా పనిచేసి రిటైరైన అధికారి ఒకరు తెలిపారు. మెయిన్ లైన్‌లో రైళ్లు గంటలకు 70-80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయని, అలాంటి సమయంలో సడన్ బ్రేక్ వేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్‌వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.
కూనేరు క్రాసింగ్ పాయింట్ వద్ద రైలు వెళ్లే పట్టా అడుగు మేర విరిగిపోయింది. ఇది గమనించని డ్రైవర్ రైలును పోనిచ్చాడు. రైలులోని సగం బోగీలు విరిగిపోయిన పట్టా నుంచి సురక్షితంగా వెళ్లిపోయాయి. అయితే ఆ తర్వాత కాసేపటికే పెద్ద శబ్దం రావడంతో పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక బోగీలు పట్టాలు తప్పి ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయి. పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. డ్రైవర్ కనుక సడన్ బ్రేక్ వేయకుంటే ముందు బోగీల్లానే వెనక బోగీలు కూడా సురక్షితంగా దాటి ఉండేవని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పట్టాలు తప్పినా అదే వేగంతో కొంతదూరం వెళ్లి ఆగిపోయి ఉండేవంటున్నారు. దీనివల్ల ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గేదని అంటున్నారు. డ్రైవర్ భయంతోనే ఈ ప్రమాదం జరిగిందని, సడన్ బ్రేకే కొంప ముంచిందని చెబుతున్నారు. మెయిన్‌లైన్‌లో వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేయకూడదన్న విషయం లోకో పైలట్ కు తెలియక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చి చెబుతున్నారు.