: వంట బాగోలేదంటే చెఫ్ కి కోపమొచ్చింది.. కంట్లో కారం కొట్టాడు!
వీకెండ్ ఇంట్లో వంట చేయడమెందుకు, హాయిగా బయటికెళ్లి ఏదైనా తిని వద్దామని భావించిన బ్రిటన్ జంటకు భారతీ రెస్టారెంట్ లో చెఫ్ షాకిచ్చి, విషాదంలోకి నెట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్ లోని బోధనా రంగంలో పని చేస్తున్న డేవిడ్ ఇవాన్స్ (46), మిషెల్లీ (47) దంపతులు సౌత్ వేల్స్ లోని ఓ బెంగాలీ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లారు. స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చిన ఆ దంపతులు అవి రుచిగా లేకపోయినా, తిన్నామనిపించారు. వెయిటర్ ఫీడ్ బ్యాక్ అడగడంతో అవి బాగోలేవని చెప్పి మెయిన్ కోర్స్ ఆర్డర్ ఇచ్చారు. అందులో మీట్ బాగా ఉడకలేదని చెప్పి దానిని పక్కన పెట్టి, మిగిలిన వంటకాలు తిన్నారు.
అనంతరం వెయిటర్ ఎలా వుందని అడగడంతో, మాంసం సరిగ్గా ఉడకలేదని,రబ్బరులా సాగుతోందని తెలిపారు. దీనిని వెయిటర్ చీఫ్ చెఫ్ కమ్రుల్ ఇస్లాంకు తెలిపాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతను వారిని తిట్టాడు. దీంతో తమనెందుకు తిడుతున్నావంటూ డేవిడ్ వంటగదికి వెళ్లి ఇస్లాంను ప్రశ్నించాడు. దీంతో తనపై దాడికి వచ్చాడని భావించిన ఇస్లాం అతని కళ్లలో కారం కొట్టాడు. దీంతో డేవిడ్ విలవిల్లాడిపోయాడు. అనంతరం నీటితో కడిగినా అంబులెన్స్ సిబ్బంది వచ్చి చికిత్స ప్రారంభించేంత వరకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కారంతో దాడి చేయడంతో కళ్లలోపలి చర్మం కాలిపోయిందని, అతను పూర్తిగా కోలుకునే వరకు పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేమని వైద్యులు తెలిపారు. అంతవరకు ఆయనకు చికిత్స కొనసాగిస్తామని వివరించారు.