: నటి శ్రీదేవి సినిమా కోసం ‘పాక్’ నటులకు వీసాలు మంజూరు
ప్రముఖ నటి శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మామ్’. ప్రముఖ నిర్మాత, ఆమె భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాకిస్థాన్ నటీనటులు అద్నాన్ సిద్దిఖీ, సజల్ అలీ కూడా నటిస్తున్నారు. శ్రీదేవికి భర్త గా అద్నాన్, కూతురుగా సజల్ ఆయా పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేసింది. కాగా, యూరీ ఘటన నేపథ్యంలో బాలీవుడ్ చిత్రాల్లో నటించిన పాకిస్థాన్ కళాకారులను భారత్ నుంచి వెళ్లిపోవాలంటూ నాడు నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘రయీస్’ చిత్రాలలో పాక్ నటులు నటించడంతో పెద్ద చర్చ కూడా జరిగింది. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం ప్రశాంతంగా విడుదల కాగా, ‘రయీస్’ త్వరలో విడుదల కానుంది. ‘మామ్’ చిత్రంలో నటిస్తున్న పాకిస్థానీ నటీనటులకు భారత్ వీసాలు మంజూరు కావడంతో ఈ సినిమా షూటింగ్ కి కూడా ఇకపై అవరోధాలు ఉండవు. ఈ సందర్భంగా పాకిస్థాన్ నిర్మాత మహ్మద్ మండ్వివాలా మాట్లాడుతూ, ఈ ఘటన ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని పెంచుతుందని ఆకాంక్షించారు.